"బే ఏరియా లోనే పాఠశాల పుట్టిందని, 6 సంవత్సరాలుగా విజయ వంతం గా నడిచిన పాఠశాల ఇప్పుడు 7 వ విద్యా సంవత్సరం లోకి అడుగు పెడుతోంది. బే ఏరియా తెలుగు సంఘం ఆద్వర్యం లో ఇక్కడ జరిగే పాఠశాల అందరికి మార్గ దర్సకం గా ఉంది. ఫ్రీమాంట్, సాన్ రామన్, డబ్లిన్, సన్నీవేల్, సాన్ హోసే, మిల్పిటాస్ పట్టణాలలో పాఠశాల తరగతులు ప్రారంభం కావటం చాల సంతోషం గా వుంది." అని పాఠశాల సీఈఓ చెన్నూరి సుబ్బా రావు ఇవాళ ఫ్రీమాంట్ లో పాఠశాల తరగతులకు వచ్చిన పిల్లలు, వారి తల్లి తండ్రులతో అన్నారు.
"పాఠశాల కొత్త సాంవత్సరం లోకో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, పాఠశాల ని ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులకు అభినందనలు" అన్నారు పాఠశాల డైరెక్టర్ శ్రీ ప్రసాద్ మంగిన.
"పాఠశాల నిన్న మొన్ననే ప్రారంభం అయ్యిందా అని పించినా, మా పిల్లలు తెలుగు నేర్చు కొని మాట్లాడటం చూస్తే పాఠశాల గొప్ప తనం తెలుస్తోంది : అని కళ్యాణ్ కట్టమూరి అన్నారు.
ఫ్రీమాంట్ లో పాఠశాల కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకకు వీరు
ఉప్పా ల, రమేష్ కొండా, శ్రీదేవి పసుపులేటి , రామ దాసు పులి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల పిల్లలు మొదటగా 'సరస్వతి నమస్తుభ్యం' పద్యం తో కొత్త సంవత్సరానికి ప్రారంభం చెప్పారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), తెలుగు టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'పాఠశాల' వసంతోత్సవ వేడుకలు మే 11వ తేదీన శాన్‌రామన్‌లోని ఐరన్ హార్స్ మిడిల్ స్కూల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 500 మందికి పైగా అతిధులు, పాఠశాల విద్యార్థులు, తల్లితండ్రులు హాజరయ్యారు. ఐదుగంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పాటలు, పద్యాలు, నాటికలు, డ్యాన్స్‌లు తదితర కార్యక్రమాలను ప్రదర్శించారు. వేడుకలు జరిగిన ప్రాంతాన్ని అందంగా అలంకరించారు. స్వాగత్ ఇండియన్ కుజిన్వారు వచ్చినవారందరికీ భోజనాన్ని వడ్డించారు. ఈ వేడుకల్లో తానా-పాఠశాల నిర్వహిస్తున్న తెలుగు పోటీలు కూడా జరిగాయి. ఈ పోటీల్లో 40 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచినవారు వాషింగ్టన్ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే తానా మహాసభల వేదికపై జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. డా. గీతామాధవి, పద్మశొంఠి, శ్రీదేవి ఎర్నేని, కళ్యాణి తదితరులు చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. విజేతలకు తానా నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి సర్టిఫికెట్లను, ట్రోఫీని బహూకరించారు.
పాఠశాల అకడమిక్ డైరెక్టర్ డా రమేష్ కొండ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీచర్లు, కో ఆర్డినేటర్ల కృషి వల్ల బే ఏరియాలోని పాఠశాలలో ప్రతి సంవత్సరం 300 మందికి పైగా విద్యార్థులు చేరుతున్నారని చెప్పారు. పాఠశాల కరికులమ్ డైరెక్టర్ డా. గీతామాధవి, మాట్లాడుతూ, యుఎస్‌లోని చిన్నారుల కోసం ప్రత్యేకంగా కరికులమ్ తయారు చేయడం జరిగిందని చెప్పారు. టీచర్లు, తల్లితండ్రులు ఈ కరికులమ్‌పై అభిప్రాయాలను ఇస్తే వాటిని సమీక్షించి సరిచేస్తామని తెలిపారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ డైరెక్టర్ ప్రసాద్ మంగిన మాట్లాడుతూ, పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం తెలుగు భాషను సులభంగా బోధించి నేర్పించడమేనన్నారు. తెలుగు మాట్లాడటంలో కష్టంగా కాకుండా ఇష్టంగా మాట్లాడేలా చేయడం పాఠశాల ఆశయమని తెలిపారు.
పాఠశాల వివిధ కేంద్రాల్లో చదువుకుంటున్న పిల్లలు నాటికలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. గుణపాఠం (శాన్‌హోసె సెంటర్), ఐకమత్యమే మహాబలం (డబ్లిన్ అడుగు చిన్నారులు), కృష్ణ వెనమాత్మ కథ (ఫ్రీమాంట్ పరుగు), చదువుకుంటే బాగుపడతాం (శాన్‌రామన్ సెంటర్), మామా తెలుగు (ఫ్రీమాంట్ సెంటర్), డబ్లిన్, ఫ్రీమాంట్ (వెలుగు) స్టూడెంట్స్ నిర్వహించిన అష్టావధానం వంటి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. బాటా కమిటీ సభ్యులు, వలంటీర్లు పాఠశాలకు సంబంధించి తల్లితండ్రులు అడిగిన సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పాఠశాల రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పాఠశాల ఇ-లెర్నింగ్‌పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి మాట్లాడుతూ, పాఠశాల విజయవంతంగా 6వసంతాలను పూర్తి చేసుకోవడం?ఆనందంగా ఉందని, ఇందుకు పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్లు, బాటా నాయకత్వమే కారణమని ప్రశంసించారు. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత అతిధులకు, ఇతరులకు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల టీమ్ అంకితభావంతో చేస్తున్న కృషిని అభినందించారు. తరువాత గ్రాడ్యుయేషన్ కార్యక్రమం సందడిగా జరిగింది. టీచర్లు, చిన్నారులు ప్రశంసాపత్రాలను అతిధుల చేతుల మీదుగా అందుకున్నారు.
బాటా వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ చికోటి మాట్లాడుతూ, పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాటా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బాటా కమిటీని ఆయన అందరికీ పరిచయం చేశారు. యశ్వంత్ కుదరవల్లి (ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి (సెక్రటరి), కొండల్రావు (ట్రెజరర్), అరుణ్ రెడ్డి (జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారకదీప్తి, లాజిస్టిక్స్ టీమ్ సభ్యులు హరి సన్నిధి, వరుణ్ముక్కా తదితరులను ఆయన పరిచయం చేశారు. ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు బాటా అడ్వయిజరీ బోర్డ్ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ అందరినీ అభినందించారు.
బే ఏరియాలోని పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్ల వివరాలు - డబ్లిన్‌లో సరస్వతీరావు, వందన, రజిత కె రావు, ఇష వరకుర్, శరత్ పోలవరపు, ఫ్రీమాంట్‌లో సునీత రాయపనేని, పద్మ విశ్వనాధ, లావణ్య అరుగొంద, దీపిక బిహెచ్‌ఎస్, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, మిల్పిటాస్లో సింధు, హరి సన్నిధి, శాన్‌హోసెలో శ్రీకాంత్ దాశరథి, మూర్తి వెంపటి, ఛాయాదేవి పొట్లూరి, శాన్‌రామన్‌లో శ్రీదేవి ఎర్నేని, కళ్యాణి చికోటి, సత్య బుర్ర, శాన్‌రామన్‌లో పద్మ శొంటి, ఉమ, సువర్ణ?జొన్నలగడ్డ, శ్రీధర్ కొడవలూరు, సురేష్ శివపురం, ధనలక్ష్మీ, ఉదయ్ ఈయుణ్ని.
కొలంబస్ ఒహయో లో పాఠశాల డైరెక్టర్ శ్రీ కాళీ ప్రసాద్ మావులేటి నిర్వాహణలో, ఆ పట్టణం లో వున్నా తానా నాయకుల సహాయ సహాకారాలతో "పాఠశాల తానా తెలుగు పోటీలు 2019" శనివారం మే 4 వ తేదీ న మొదలు అయ్యాయి. వచ్చే వారం నుంచి వరసగా ఒకటి లేదా రెండు చోట్ల ఈ పోటీల నిర్వాహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక చోట్ల నుంచి పోటీలు నిర్వహించటానికి ముందుకు వస్తున్న పాఠశాల, తానా మరియు తెలుగు అభిమానులకు మా ధన్యవాదాలు. ఈ పోటీలు నిర్వహించటానికి కొన్ని వివరాలు ఇస్తూ ఎక్కువ చోట్ల జరపటానికి మేము సిద్ధం గా ఉన్నామని అందరికి పాఠశాల తానా ల తరుపున తెలియ చేస్తున్నాం.
1. మీ ప్రాంతం లో తెలుగు చిన్నారుల కోసం ఈ పోటీలు నిర్వహించాలనుకొనే వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి.
www.paatasala.net/telugupoteelu
2. మీరు పోటీలు జరపటానికి ఒక ప్లేస్ (ఓ స్కూల్ గాని, ఓ టెంపుల్ గాని, ఓ ఆఫీస్ గాని), ఒక తేదీ (జూన్ చివరి వరకు వున్న శని లేదా ఆదివారం లలో) నిర్ణయించి మాకు తెలియ చేయండి.
3. పాఠశాల, హైదరాబాద్ ఆఫీస్ వెంటనే మీ వూరికి తెలుగు పోటీల పోస్టర్ ని, పాంఫ్లెట్ ని, ఈ ఫ్లయర్ ని తాయారు చేసి పంపుతుంది. అలా వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ తో పబ్లిసిటి మొదలు పెట్టటమే! ఈ ఫ్లయర్ ని FB ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇమెయిల్ ద్వారా మీ ఊరిలోని అన్ని గ్రూప్ లకు పంపి ఎక్కువ మంది పిల్లలు రిజిస్టర్ అయ్యేలా చేయండి.
4. హైదరాబాద్ నుంచి పోటీలలో పాల్గొనే సర్టిఫికెట్స్, గెలిచిన వారికి ఇచ్చే ట్రోపీలు, కావలిసిన ఫ్లెక్స్ బ్యానెర్లు అన్నిమీకు పంప బడుతాయి.
తెలుగు భాష కి అభిమాని గా, తానా సభ్యుని గా మీరు మీ ఊరి పిల్లల తెలుగు భాష నైపుణ్యాన్ని గుర్తించేలా చెయ్యండి.
నాగ్‌పూర్‌లోని ఆంధ్ర ఆసోసియేషన్ నిర్వహిస్తున్న తెలుగు పాఠశాల తరగతులు ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా వసంతోత్సవం నిర్వహించారు. జనవరి 6వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి ఎం.చంద్రశేఖర్, పాఠశాల వ్యవహారాలను చూస్తున్న మేనేజర్ ఎం.సంధ్యరెడ్డి, పాఠశాల టెక్స్ట్‌బుక్స్ రచయిత సుషుమ్న రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పార్వతీ కల్యాణం హరికథ వచ్చినవారిని ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం సుషుమ్న మాట్లాడుతూ పిల్లలు తెలుగు పదాలను అర్థం చేసుకుని క్రమం తప్పకుండా మాట్లాడాలని అప్పుడే భాషలో పరిపూర్ణతను సాధించగలరన్నారు. ఇంట్లో కూడా తెలుగు మాట్లాడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. మురళిధర్, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.ఎన్.మూర్తి, సమన్వయ కర్త పి.టి.శర్మ అతిథులను సన్మానించారు.
ఎన్ ఆర్ ఐ పిల్లలకు పాఠశాల సేవలు అవసరం- మంత్రి గంటా 'ఏ దేశం లో వున్నా,ఏ రాష్ట్రం లో వున్నా తెలుగు వారు తమ పిల్లలకు తల్లి భాష తెలుగు నేర్పాల్సిన అవసరం ఉందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ఒక్కటే అలాంటి అవసరం గుర్తించి తెలుగు పిల్లలకు 4 సంవత్సరాల తెలుగు కోర్స్ ప్రారంభించిందని, అమెరికా లోని పాఠశాల సంస్థ ఆ తెలుగు కోర్స్ ని విజయ వంతం గా నిర్వహిస్తోంది' అని శ్రీ గంటా శ్రీనివాస రావు అన్నారు. ఈ రోజు సాయత్రం శ్రీ గంటా శ్రీనివాసరావు ఇంటిలో జరిగిన కార్యక్రమంలో విధ్యా మంత్రి శ్రీ గంటా పాఠశాల తయారు చేసిన సారి కొత్త వెబ్సైట్ www.paatasala.net ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల వెబ్ సైట్ చాలా సరళంగా, వివరంగా ఉందని, పాఠశాల తెలుగు కమ్యూనిటీ కి మరింత చేరువ అవుతుందని, పాఠశాల చేస్తున్న కృషిని అభినందించారు. ముందుగా పాఠశాల సీఈఓ శ్రీ సుబ్బా రావు చెన్నూరి పాఠశాల ఒక లాభాపేక్ష లేని సంస్థ అని తెలుపుతూ పాఠశాల వెబ్ సైట్ ఫీచర్స్ ని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మధుసూదన్ రావు, డైరెక్టర్, APSECRT, శ్రీ వెంకట్ ఈదర, Adviser, Govt of AP కూడా ఉన్నారు.
బే ఏరియాలోని 'పాఠశాల' తెలుగు భాషను నేర్చుకుంటున్న చిన్నారులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మాతృభాష తెలుగును చిన్నారులకు సులభంగా నేర్పుతూనే మన సంస్కృతి, పండుగలను కూడా వేడుకగా చేయడంలో పాఠశాల యాజమాన్యం ముందుంటోంది. ఈ దీపావళిని పురస్కరించుకుని చిన్నారులు ప్రమిదలను సొంతంగా తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రతిభను అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లితండ్రులతోపాటు పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. పాఠశాల కో ఆర్డినేటర్లు చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలతోపాటు స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా చిన్నారులు దీపావళి ప్రాముఖ్యతను వివరించేలా పాటలను, ప్రసంగాలను చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్యంలో ఉన్నవారు తమ సంతతి అమెరికాలో ఉన్నప్పటికీ
వారు పూర్తి సంతోషాన్ని పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఇక్కడ ఉన్న సంతతికి
తెలుగు రాకపోవడమే. దాంతో వారు తమ మనవళ్ళు, మనవరాళ్ళతో స్వేచ్ఛగా తెలుగులో
మాట్లాడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని తొలగించడానికి 'పాఠశాల' కృషి
చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా
శ్రీనివాసరావు అన్నారు.
రెండేళ్ళ క్రితం తాను కాలిఫోర్నియా వచ్చినప్పుడు పాఠశాల టీమ్తోనూ,
చిన్నారులతోనూ సమావేశమైనప్పుడు తెలుగు భాషపై వారికి ఉన్న అంకితభావాన్ని
గుర్తించినందునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ పాఠశాలను తన
భాగస్వామిగా తీసుకుందని చెప్పారు. ఎన్నారై పిల్లల కోసం 4 సంవత్సరాల తెలుగు
కోర్సును రూపొందించి పాఠశాల ద్వారా దానిని ఎపి ప్రభుత్వ విద్యాశాఖ బోదిస్తోందని
చెప్పారు. ఈ సంవత్సరం దాదాపు 30 మంది పిల్లలు 4 సంవత్సరాల తెలుగు కోర్స్‌ను
పూర్తి చేసి సర్టిఫికెట్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల వసంతోత్సవ వేడుకలను జూన్
3వ తేదీన మిల్పిటాస్లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ఘనంగా
నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.
వార్షికోత్సవ వేడుకలను వసంతోత్సవం పేరుతో నిర్వహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోని
ప్రభుత్వ స్కూళ్ళలో కూడా వార్షికోత్సవ వేడుకలను వసంతోత్సవం పేరుతో
నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక
కార్యక్రమాలు బావున్నాయని, అందులో 'భువన విజయం' వంటి క్లిష్టమైన ప్రదర్శనను
కూడా పాఠశాల విద్యార్థులు సులభంగా చేశారని చెప్పారు.
రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ, ఎన్నారై పిల్లలకు మాతృభాషపై
మమతను పెంచడంలో పాఠశాల చేస్తున్న కృషిని అభినందించారు. గుంటూరు జడ్పి
మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్యం మాతృభాషను
బోధించడమే కాకుండా వారిని మాతృరాష్ట్రానికి కూడా కనెక్ట్ చేస్తోందని
అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి
మాట్లాడుతూ, పాఠశాలను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించామని చెప్పారు. నేడు 4
సంవత్సరాల తెలుగుకోర్స్ను పిల్లలు పూర్తి చేయడం సంతోషంగా ఉందని, వారు
కోర్స్‌ను పూర్తి చేయడానికి మూల కారణం మాత్రం అంకితభావంతో విధులను
నిర్వహిస్తున్న పాఠశాల టీచర్లేనని చెప్పారు. విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న
దాదాపు 200 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను, మెడల్స్‌ను మంత్రి గంటా
శ్రీనివాసరావు బహుకరించారు. సన్నివేల్, డబ్లిన్, శాన్‌రామన్,
ఫ్రీమాంట్, శాన్‌హోసెలో ఉన్న పాఠశాల కేంద్రాల విద్యార్థులు పలు
సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బాటా అడ్వయిజర్ శ్రీమతి విజయ
ఆసూరి, బాటా మాజీ ఆధ్యక్షులు ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, పాఠశాల
సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు వెంకట్
ఈదర, వైజాగ్ జడ్పి మాజీ చైర్మన్ లాలం భాస్కర్ తదితరులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాషింగ్టన్ తెలుగు సంఘం శనివారం, 7 ఏప్రిల్ 18 న ఉగాది వేడుక ఘనం గా జరుపు
కొంది తెలుగు టైమ్స్ ఎడిటర్ గా , పాఠశాల సీఈఓ గా నేను కూడా పాల్గొనటం ఎంతో
సంతోషాన్ని ఇచ్చింది.
' అన్నా...' అంటూ ఆప్యాయంగా వాళ్ళ ఇంటిలో ఆతిధ్యం ఇచ్చిన తానా అధ్యక్షులు శ్రీ
సతీష్ వేమన కి, శ్రీమతి నీలిమ కు నా కృతఙ్ఞతలు. అలాగే ఉగాది వేడుక లో పాల్గొనే
అవకాశం ఇచ్చిన GWTCS కార్య వర్గం కు, అధ్యక్షులు శ్రీ సత్య మన్నే కు నా
కృతజ్ఞతలు.
ఈ వేడుక లో పాల్గొనటానికి ఓ కారణం వుంది. ఈ సంవత్సరం నుంచి పాఠశాల వర్జీనియా లో
GWTCS సహకారం తో రాబోతున్నాయని చెప్పటానికి చాలా సంతోషం గా వుంది. ఇప్పటికే
పాఠశాల నిర్వాహణకు PRISM అనే విద్యా సంస్థ తో పాఠశాల అన్ని ఏర్పాట్లు
చేసుకోంది. PRISM తరుపున పాఠశాల కు Area Director గా Smt Sravya Bayana
వర్జీనియా ప్రాతం లో Ashburn , Herndon, Southriding , Chanteley లలో పాఠశాల
సెంటర్ లు ఏర్పాట్లు చేస్తున్నారు.
GWTCS లాంటి పెద్ద సంఘం సహకారం తో PRISM లాంటి సంస్థ ఏర్పాట్లు తో పాఠశాల కు
వర్జీనియా ప్రాంతంలో పూర్తి గా విస్తరిస్తుందని మా నమ్మకం. వర్జీనియా తెలుగు
వారికి పాఠశాల సాదరం గా ఆహ్వానిస్తోంది.
అమెరికాలోని మన చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకోసం 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పాఠశాల నేడు ఇండియాలోని పలు నగరాల్లో, పట్టణాల్లో కూడా తన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో దాదాపు 20 కేంద్రాల ద్వారా 400 మంది చిన్నారులకు తెలుగు భాషను 'పాఠశాల' నేర్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన 'తెలుగు పలుకు' కోర్స్‌ను పాఠశాల బోధిస్తున్న సంగతి తెలిసిందే. నేటితరానికి అనుగుణంగా, సులభంగా, శాస్త్రీయంగా ఉండేలా ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు (LSRW) పద్ధతిలో అంటే వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం ద్వారా తెలుగు భాషను నేర్పిస్తోందని పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు నివసిస్తున్న చోట్ల పాఠశాల విద్యాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సుబ్బారావు వివరించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆంధ్రఅసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలను జనవరి 7వ తేదీన ప్రారంభించడం జరిగిందని చెప్పారు. త్వరలోనే కొచ్చి, ముంబైలలో కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
నాగ్‌పూర్‌లో జరిగిన పాఠశాల కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ డా. కె. వెంకటేశం ముఖ్య అతిధిగా హాజరై మాతృభాష పరిరక్షణకు ఆంధ్ర అసోసియేషన్, పాఠశాల చేస్తున్న కృషిని ప్రశంసించారు. మనం ఎక్కడ ఉన్నా మన మాతృభాష తెలుగును విస్మరించరాదని, దానిని పరిరక్షించుకోవడం మన బాధ్యత అని ఆయన చెప్పారు.
ఆంధ్ర అసోసియేషన్ నాగ్‌పూర్‌లో ఉన్న తెలుగు కుటుంబాల సౌకర్యార్థం ఈ పాఠశాల కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, దీనికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్ర అసోసియేషన్ కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 28 రిజిస్ట్రేషన్స్ వచ్చాయని, ఇద్దరు టీచర్లను నియమించామని, అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు తరగతులను నిర్వహిస్తున్నామని పాఠశాల సెంటర్ కో ఆర్డినేటర్ పిటి శర్మ తెలిపారు. పాఠశాలలో చేరాలనుకునేవారు జనవరి నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం తనను 9421801151లో సంప్రదించవచ్చని చెప్పారు.
అమెరికాలో పాఠశాల ఇంక్ పేరుతో రిజిష్టర్ అయి, 501 సి(3) గుర్తింపును పొందిన ఈ సంస్థకు మేనెజింగ్ పార్టనర్‌గా టీవీ5 వ్యవహరిస్తోంది.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ నవంబర్ 4వ తేదీన శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్ థియేటర్లో నిర్వహించిన దీపావళి వేడుకలు బే ఏరియా వాసులు మరిచిపోలేని వేడుకగా నిలిచింది. వేడుకల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు జరిగిన ఈ వేడుకల్లో ఎన్నో కార్యక్రమాలను బాటావారు ప్రదర్శించారు.
వేడుకలను పురస్కరించుకుని వేదికను దీపావళి దివ్వెలతో పువ్వులతో అందంగా అలంకరించారు. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో హైలైట్‌గా ఎన్నో కార్యక్రమాలు నిలిచాయి. చిన్నారులు ప్రదర్శించిన బూచాడమ్మ బూచాడు, రాధా మాధవీయం, పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన బాహుబలి నాటిక అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. బాటా యూత్ ప్రదర్శించిన సీతే మార్ ఉర్రూతలూగిస్తే, పరంపర ఫ్యాషన్‌షో అహా అనిపించింది.
బే ఏరియాలో 5 సెంటర్లలో, ప్రతి సెంటర్లోనూ 5 తరగతులతో దాదాపు 25 మంది టీచర్లతో చిన్నారులకు తెలుగు భాషను పాఠశాల దిగ్విజయంగా నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. 2017-18 కొత్త విద్యాసంవత్సరాన్ని గతవారం లాంఛనంగా పాఠశాల ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వం రూపొందించిన కొత్త సిలబస్, కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసిన సంగతి కూడా పాఠకులకు విదితమే.
ఈ నేపథ్యంలో పాఠశాల టీచర్లకు ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యప్రణాళిక, ఇతర విషయాలపై చర్చించేందుకుగాను అవగాహన తరగతులను సెప్టెంబర్ 15వ తేదీన మిల్పిటాస్లోని ఆఫీస్ ఆన్ స్పెషల్
రిఫ్రజెన్టేటివ్ ఆఫ్ నార్త్ అమెరికా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీచర్లను ఉద్దేశించి పాఠశాల కరికులమ్ డైరెక్టర్ డాక్టర్ కె. గీతా మాధవి ప్రసంగించారు. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అనుసరించాల్సిన పాఠ్యప్రణాళికలను, బోధన వివరాలను ఆమె తెలియజేశారు.
సింగపూర్ యూనివర్సిటీ నుంచి పాఠశాల పుస్తకాల ఆధర్, ఇ లెర్నింగ్ డైరెక్టర్ సుషుమ్నరావు తాడినాడ ఈ సంవత్సరం నుంచి ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు విధానంలో బోధన పద్ధతిని అమలు చేయనున్నట్లు చెప్పారు. Learning - Speaking - Reading- Writing పద్ధతిలో బోధన ఉంటుందని, తొలుత భాషను తెలుసుకోవడం, తరువాత మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి చేయిస్తారన్నారు. పాఠశాల చైర్మన్ జయరామ్ కోమటి, సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, డైరెక్టర్లు ప్రసాద్ మంగిన, రమేష్ కొండ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం గత సంవత్సరం పాఠశాలలో విద్యాబోధన చేసిన టీచర్ల సేవలను ప్రశంసిస్తూ, వారికి గౌరవభృతిని చెక్కు రూపంలో పాఠశాల చైర్మన్ జయరామ్ కోమటి అందజేశారు
అమెరికాలో గత 4 సంవత్సరాలుగా ఎన్నారై తెలుగు చిన్నారులకు మాతృభాష తెలుగును నేర్పిస్తున్న 'పాఠశాల', ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కొత్తగా రూపొందించిన 'తెలుగు పలుకు' కోర్స్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి బోధిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా 'తెలుగు పలుకు' అచ్చు పుస్తకాన్ని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో టెక్స్ట్‌బుక్ డిపార్ట్మెంట్ కో ఆర్డినేటర్ టీవిఎస్ రమేష్, పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని రూపొందించిన టీచర్లు ఎ. సరళమ్మ, వి. స్వర్ణలత, కె. శేషగిరిరావు, నక్క డేవిడ్‌రాజు ఇతరులకు ఈ సందర్భంగా తొలి ప్రతులను అందించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, తెలుగుభాషను నేర్చుకుంటున్న ఎన్నారై చిన్నారులకు సులభంగా తెలుగును నేర్చుకునేలా ఈ పుస్తకం ఉంటుందని చెప్పారు. LSRW పద్ధతి ద్వారా తెలుగును త్వరితంగా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 9 నుంచి బే ఏరియాలో పాఠశాల 2017-18 విద్యాసంవత్సరం ప్రారంభమవుతోందని ఆయన చెప్పారు.
పాఠశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం www.paatasala.net చూడాల్సిందిగా చెన్నూరి వెంకట సుబ్బారావు కోరారు.
అమెరికాలోని తెలుగు చిన్నారులకు గత నాలుగు సంవత్సరాలుగా మాతృభాష తెలుగును
నేర్పిస్తున్న 'పాఠశాల' వసంతోత్సవ వేడుకలు ఫిలడెల్ఫియాలో జూలై 15వ తేదీన ఘనంగా
జరిగింది. కాలేజివిల్లేలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్లో జరిగిన ఈ
వేడుకలకు 300 మందికిపైగా ఆహ్వానితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది చిన్నారులు
సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. టీచర్లు విద్యుల్లత వాసిరెడ్డి, సునీత, లక్ష్మీ
అద్దంకి, పద్మ ఈ సాంస్కృతిక ప్రదర్శనలను లీడ్ చేశారు. పాఠశాల చిన్నారులు
చేసిన శ్రీకృష్ణరాయబారం, తెలుగు కవులు, బాహుబలి నాటిక వంటి కార్యక్రమాలు అందరినీ
ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ పాఠశాలను ప్రమోట్ చేస్తున్న సంగతి
తెలిసిందే. ఈ నేపథ్యంలో తానా అధ్యక్షులు సతీష్ వేమన, ట్రెజరర్ రవి
పొట్లూరి సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా జరిపినట్లు పాఠశాల ఏరియా కో ఆర్డినేటర్
నాగరాజు నలజుల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర
ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర దేశానికి వచ్చినా సొంత
సంస్కృతిని మర్చిపోకుండా పిల్లలకు తెలుగు భాష నేర్పించడానికి పాఠశాల ప్రయత్నించడం
గొప్ప విషయమని అన్నారు.
తెలుగువారికి సొంత భాషపై ఉన్న మమకారానికి ఇది
నిదర్శనమని ప్రశంసించారు. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాఠశాల తరగతులు
ఏర్పాటు చేసి తెలుగు భాషను చిన్నారులకు ఇతరులకు కూడా నేర్పించాలని కోరారు.
రాజేంద్రప్రసాద్‌ను తానా ట్రస్టీ హరీష్ కోయ, సాంబయ్య ఘనంగా
సన్మానించారు. తెలుగు ప్రముఖులు అక్కిరాజు శర్మ, మల్లిక్‌ను కూడా సత్కరించారు.
అపర్ణ వాగ్వాల ఈ వేడుకకు యాంకర్‌గా వ్యవహరించారు. యువ గాయకులు బుధవరపు
సిస్టర్స్ (భాస్కరి, సింధు) పాడిన పాటలు అందరినీ ఎంతగానో
ఆనందింపజేశాయి.
ఈ వేడుకను విజయవంతం చేయడానికి ఎంతోమంది సహకరించారు. సరోజ సాగరం, సునీత, సరోజ
పావులూరి, లక్ష్మీ అద్దంకి, విద్యుల్లత వాసిరెడ్డి, విజయ జరుగుల, స్వరూప కోటపాటి,
ఇందు సందడి, సునీత నలజుల, రాధా దేవి, కృష్ణజ నందమూరి, విజయశ్రీ పరుచూరి, రూప
కోగంటి, రాజేశ్వరి కంతేటి, పద్మ బోగడి వచ్చినవారికి పసందైన విందును తయారు చేసి
అందించారు.
కనెక్టికట్ నుంచి రావు యలమంచిలి, శ్రీనివాస్ భర్తవరపుతోపాటు, సాంబయ్య,
సాయి జరుగుల, సతీష్ తుమ్మల, సింహబలుడు, హనుమంతు, సుధాకర్, గోపీ కృష్ణ,
రమ, కృష్ణ, సునీల్, పికె కంతేటి, చలం, మోహన్ తమ్మన్న, శ్రీకృష్ణరాజ్,
సుధాకర్, హరి కృష్ణ, మహర్షి, శ్రీకాంత్ చేబ్రోలు, యాది, కోటి ఏలూరి
వెంకట ఆదిత్య తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డోనర్లుగా వ్యవహరించిన రవి
పొట్లూరి, హరీష్ కోయ, రవి మందలపు, వేణు, లక్ష్మీ మోపర్తి, సతీష్ తుమ్మల
తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలను నిర్వాహకులు తెలియజేశారు.
న్యూజెర్సి పరిసర ప్రాంతాల్లోని తెలుగు చిన్నారులకు మాతృభాషను నేర్పుతున్న పాఠశాల వసంతోత్సవం జూన్ 17వ తేదీన సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై పిల్లల కోసం ప్రవేశపెట్టిన 'తెలుగు పలుకు' కోర్స్‌ను ఎపి ప్రభుత్వవిద్యాశాఖతో కలిసి నేర్పుతున్నట్లు చెప్పారు. సులభంగా తెలుగును నేర్చుకునేలా సిలబస్‌ను కూడా మార్చినట్లు తెలిపారు. పాఠశాల ఏరియా డైరెక్టర్ రామ్వేదాంతం?కూడా పాఠశాల విద్యాబోధనపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లను పరీక్షల్లో ఉత్తీర్ణులైన చిన్నారులకు బహూకరించారు. టిఫాస్ ప్రెసిడెంట్ గురుఆలంపల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు.
అమెరికాలో వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగు చిన్నారులకోసం ఏర్పాటు చేసిన 'పాఠశాల' కేంద్రాలు 2016-17 విద్యాసంవత్సరంను విజయవంతంగా నిర్వహించడంతోపాటు వివిధ చోట్ల పాఠశాల వసంతోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాల విద్యార్థుల భాషా పటిమను తెలియజేయడంతోపాటు, వారి కళానైపుణ్యాలను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా సదరన్ కాలిఫోర్నియాలోని పాఠశాల కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన వసంతోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి. ఇర్వైన్లోని లేక్ వ్యూ సీనియర్ సెంటర్లో ఏప్రిల్ 1వ తేదీన జరిగిన ఈ వేడుకలకు చిన్నారులతోపాటు తల్లితండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల ఏరియా డైరెక్టర్ శ్రీధర్ సాతులూరి అందరినీ ఆహ్వానించి ప్రసంగించారు. తెలుగు భాషను సులభంగా విద్యార్థులకు ఎలా నేర్పుతున్నామో వివరించారు. వినోద్ బూరుగుపల్లి, సూర్య ప్రకాష్ భమిడిపాటి, నవీన్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఇర్విన్ కేంద్రంలోని టీచర్లు సుందీప్త ఆచంట, శారద అమిర్నేని, శిరీష అల్లాని, మాధవిలత చుందూరు, రూపేష్ నర్రా, లేక్ఫారెస్ట్ కేంద్రంలలోని టీచర్లు వాణి కందిపాటి, రాజేష్ దొడ్డలపూడి, సురేష్ కోటపాటి (లేక్ఫారెస్ట్ కో ఆర్డినేటర్) తదితరులు విద్యార్థుల భాషా నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. హర్ష, శ్రీహరి, మహేష్ తదితరులు విద్యార్థుల సాంస్కృతిక కళా నైపుణ్యాన్ని ఫోటోలలో ఇనుమడింపజేశారు
మన మాతృభాష తెలుగును మన చిన్నారులకు నేర్పించే బాధ్యతను ప్రతి ఎన్నారై తెలుగు కుటుంబం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడటం ద్వారా వారికి మాతృభాషపై మమకారం కలిగేలా చూడాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ వారు 'పాఠశాల' ద్వారా ప్రవేశపెట్టిన తెలుగు పలుకు కోర్స్ ఆన్లైన్ వర్షన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రసంగించారు. అమెరికాలోని చిన్నారులకు తెలుగును నేర్పిస్తున్న 'పాఠశాల'ను ఆయన అభినందించి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా తెలుగు బోధనను చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇందువల్ల మరింతమందికి తెలుగు భాషను నేర్చుకునే సౌకర్యం కలిగిందన్నారు. ఎపి ప్రభుత్వం అందిస్తున్న తెలుగు పలుకు కోర్సును ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా నేర్చుకోవాలని కోరారు.
పాఠశాల చైర్మన్ జయరామ్ కోమటి మాట్లాడుతూ, అమెరికాలో గత నాలుగేళ్ళుగా చిన్నారులకు తెలుగు భాషను 'పాఠశాల' నేర్పిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎపి ప్రభుత్వంతో కలిసి తెలుగు పలుకు కోర్స్‌ను చిన్నారులకు నేర్పిస్తున్నట్లు చెప్పారు. పాఠశాల వైస్ చైర్మన్ ప్రసాద్ గారపాటి మాట్లాడుతూ, పాఠశాల ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గుర్తింపును కూడా కలిగి ఉందని చెప్పారు. ప్రపంచంలోని ఎన్ఆర్ తెలుగు కమ్యూనిటీకి తెలుగు భాషను బోధించడమే తమ లక్ష్యమని చెప్పారు.
పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, నేటి తరం చిన్నారులు సులభంగా తెలుగును నేర్చుకునేలా కొత్త సిలబస్‌తో అచ్చుపుస్తకాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త సిలబస్ ప్రకారం ఇ-లెర్నింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. తెలుగు భాషను క్రమపద్ధతిలో నేర్పించడంతోపాటు శాస్త్రీయంగా అక్షరాలను అభ్యసించేలా బోధన ఉంటుందని చెప్పారు. Learning - Speaking - Reading- Writing పద్ధతిలో మా బోధన ఉంటుందని చెప్పారు. తొలుత భాషను తెలుసుకోవడం, తరువాత మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి చేయిస్తామని తెలిపారు. Forsys Inc కంపెనీ ప్రస్తుతం పాఠశాలకు టెక్నాలజీ పార్టనర్‌గా వ్యవహరిస్తోందని, ఆన్లైన్ కోర్సుల నిర్వహణ వ్యవహరాలను చూస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్వయిజరీ బోర్డ్ సభ్యురాలు విజయ ఆసూరి కూడా పాల్గొన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా బే ఏరియాలో విజయవంతంగా నడుస్తున్న పాఠశాల నేడు సన్నివేల్ టెంపుల్ ఆడిటోరియంలో వసంతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంది. దాదాపు 150 మందికిపైగా పాఠశాల విద్యార్థులు తెలుగు భాష, సంస్కృతి ఉట్టిపడేలా 5 గంటలపాటు వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్లు రమేష్ కొండా, ప్రసాద్ మంగిన, సిఇఓ సుబ్బారావు చెన్నూరి వచ్చిన అతిధులకు తొలుత స్వాగతం పలికారు. సన్నివేల్, శాన్‌రామన్, ఫ్రీమాంట్, డబ్లిన్, శాన్‌హోసె పాఠశాల సెంటర్ విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. డబ్లిన్ విద్యార్థులు ప్రదర్శించిన దశావతారాలు, ఫ్రీమాంట్ విద్యార్థులు ప్రదర్శించిన బాహుబలి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 4 ఏళ్ళ వయస్సు ఉన్న పిల్లలు కూడా తెలుగులో మాట్లాడి, పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ సీతారామాంజనేయులు మాట్లాడుతూ, తెలుగు భాషలో పదాలకు మంచి భావాలు ఉన్నాయని చెప్పారు. అమ్మ అంటే ఆత్మీయత అని అంటూ, మమ్మీ అన్న పదానికి దీనికి చాలా తేడా ఉందన్నారు. అన్న అని పిలిచినప్పుడు కలిగే భావాలు, బ్రదర్ అని పిలిచినప్పుడు కలగవన్నారు. అలాంటి తల్లిభాష తెలుగును ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్న 'పాఠశాల' కృషిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్న పాఠశాల తెలుగు కోర్స్‌కి ప్రభుత్వ మద్దతు, సహకారం ఎప్పుడూ ఉంటాయని అన్నారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పాఠశాల' ద్వారా నిర్వహించిన 'తెలుగు అడుగు' పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇచ్చే అవకాశం తనకు లభించిడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పాఠశాల చైర్మన్ జయరామ్ కోమటి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు భాషను నేర్పుతున్న పాఠశాలకు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రావడం, మొదటిసారి తెలుగు అడుగు పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ద్వారా నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు.
పాఠశాల సిఇఓ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వారు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, ఎన్నారై పిల్లల కోసం కొత్త సిలబస్‌ను తయారు చేసి ఇచ్చారని, ఈ సిలబస్ ద్వారా తెలుగు నేర్చుకోవడం మరింత సులభమైందని చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌లోనూ, పాఠశాల కేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహించామని, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్‌ను ప్రదానం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు అడుగు ప్రభుత్వ పరీక్షలో పాసైనవారికి, ఇతర క్లాస్లవారికి మెడల్స్, సర్టిఫికెట్లను ముఖ్య అతిధి రామాంజనేయులు ఇచ్చారు. పాఠశాల టీచర్లకు కూడా మెమోంటోలు ఇచ్చారు.
ఈ వసంతోత్సవంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కుపర్టినో మేయర్ సవితా వైద్యనాథన్, కుపర్టినో స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ అంజలి కౌజర్, ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ డా. యాంగ్ చావో, సరటోగా సిటీ కౌన్సిల్ మెంబర్ రిషి కుమార్, సన్నివేల్ సిటీ కౌన్సిల్ మెంబర్ లారీ క్లెన్తోపాటు థెరెసా కాక్స్ తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చారు.