పాఠశాల-తానా సంయుక్తంగా నిర్వహించే తెలుగు పోటీల ముఖ్య ఉద్దేశ్యం చిన్నారుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంచడమే తెలుగుభాష అంటే మక్కువ కలిగేలా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పించాలన్న ఉద్దేశ్యంతో 2013లో పాఠశాలను ప్రారంభించారు. కాలిఫోర్నియా, న్యూజెర్సి, పెన్సిల్వేనియా, మేరీలాండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం పాఠశాల తరగతులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ వారితో కలిసి పాఠశాల ప్రతి సంవత్సరాంతంలో పరీక్షలను నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ఎపి ప్రభుత్వంవారిచే సర్టిఫికెట్లను కూడా బహూకరిస్తోంది.
తానా కూడా మొదటి నుంచి తెలుగు భాష పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తోంది. అమెరికాలోనే కాకుండా, మాతృరాష్ట్రంలోనూ, ఇతర పొరుగు రాష్ట్రంలోనూ తెలుగు భాషను కాపాడేందుకు వీలుగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తానా మహాసభల్లో తెలుగు సాహిత్యానికి పెద్దపీట వేసి సాహితీవేత్తలను రప్పించి వారిచేత తెలుగుభాష ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
అమెరికాలోని చిన్నారుల తెలుగుభాషా పటిమను పెంచడానికే ఇలాంటి పోటీలను తానా పాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల ద్వారా మరింతమంది చిన్నారులు కూడా తెలుగు భాషను నేర్చుకునేందుకు ముందుకువస్తారని భావిస్తోంది.