అమెరికాలోని తెలుగు చిన్నారులకు గత నాలుగు సంవత్సరాలుగా మాతృభాష తెలుగును నేర్పిస్తున్న 'పాఠశాల' వసంతోత్సవ వేడుకలు ఫిలడెల్ఫియాలో జూలై 15వ తేదీన ఘనంగా జరిగింది. కాలేజివిల్లేలోని కమ్యూనిటీ మ్యూజిక్‌ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు 300 మందికిపైగా ఆహ్వానితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. టీచర్లు విద్యుల్లత వాసిరెడ్డి, సునీత, లక్ష్మీ అద్దంకి, పద్మ ఈ సాంస్కృతిక ప్రదర్శనలను లీడ్‌ చేశారు. పాఠశాల చిన్నారులు చేసిన శ్రీకృష్ణరాయబారం, తెలుగు కవులు, బాహుబలి నాటిక వంటి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ పాఠశాలను ప్రమోట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తానా అధ్యక్షులు సతీష్‌ వేమన, ట్రెజరర్‌ రవి పొట్లూరి సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా జరిపినట్లు పాఠశాల ఏరియా కో ఆర్డినేటర్‌ నాగరాజు నలజుల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర దేశానికి వచ్చినా సొంత సంస్కృతిని మర్చిపోకుండా పిల్లలకు తెలుగు భాష నేర్పించడానికి పాఠశాల ప్రయత్నించడం గొప్ప విషయమని అన్నారు.

తెలుగువారికి సొంత భాషపై ఉన్న మమకారానికి ఇది నిదర్శనమని ప్రశంసించారు. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాఠశాల తరగతులు ఏర్పాటు చేసి తెలుగు భాషను చిన్నారులకు ఇతరులకు కూడా నేర్పించాలని కోరారు. రాజేంద్రప్రసాద్‌ను తానా ట్రస్టీ హరీష్‌ కోయ, సాంబయ్య ఘనంగా సన్మానించారు. తెలుగు ప్రముఖులు అక్కిరాజు శర్మ, మల్లిక్‌ను కూడా సత్కరించారు. అపర్ణ వాగ్వాల ఈ వేడుకకు యాంకర్‌గా వ్యవహరించారు. యువ గాయకులు బుధవరపు సిస్టర్స్‌ (భాస్కరి, సింధు) పాడిన పాటలు అందరినీ ఎంతగానో ఆనందింపజేశాయి.

ఈ వేడుకను విజయవంతం చేయడానికి ఎంతోమంది సహకరించారు. సరోజ సాగరం, సునీత, సరోజ పావులూరి, లక్ష్మీ అద్దంకి, విద్యుల్లత వాసిరెడ్డి, విజయ జరుగుల, స్వరూప కోటపాటి, ఇందు సందడి, సునీత నలజుల, రాధా దేవి, కృష్ణజ నందమూరి, విజయశ్రీ పరుచూరి, రూప కోగంటి, రాజేశ్వరి కంతేటి, పద్మ బోగడి వచ్చినవారికి పసందైన విందును తయారు చేసి అందించారు.

కనెక్టికట్‌ నుంచి రావు యలమంచిలి, శ్రీనివాస్‌ భర్తవరపుతోపాటు, సాంబయ్య, సాయి జరుగుల, సతీష్‌ తుమ్మల, సింహబలుడు, హనుమంతు, సుధాకర్‌, గోపీ కృష్ణ, రమ, కృష్ణ, సునీల్‌, పికె కంతేటి, చలం, మోహన్‌ తమ్మన్న, శ్రీకృష్ణరాజ్‌, సుధాకర్‌, హరి కృష్ణ, మహర్షి, శ్రీకాంత్‌ చేబ్రోలు, యాది, కోటి ఏలూరి వెంకట ఆదిత్య తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డోనర్లుగా వ్యవహరించిన రవి పొట్లూరి, హరీష్‌ కోయ, రవి మందలపు, వేణు, లక్ష్మీ మోపర్తి, సతీష్‌ తుమ్మల తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలను నిర్వాహకులు తెలియజేశారు.

న్యూజెర్సి పరిసర ప్రాంతాల్లోని తెలుగు చిన్నారులకు మాతృభాషను నేర్పుతున్న పాఠశాల వసంతోత్సవం జూన్‌ 17వ తేదీన సౌత్‌ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నారై పిల్లల కోసం ప్రవేశపెట్టిన 'తెలుగు పలుకు' కోర్స్‌ను ఎపి ప్రభుత్వవిద్యాశాఖతో కలిసి నేర్పుతున్నట్లు చెప్పారు. సులభంగా తెలుగును నేర్చుకునేలా సిలబస్‌ను కూడా మార్చినట్లు తెలిపారు. పాఠశాల ఏరియా డైరెక్టర్‌ రామ్‌వేదాంతం?కూడా పాఠశాల విద్యాబోధనపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లను పరీక్షల్లో ఉత్తీర్ణులైన చిన్నారులకు బహూకరించారు. టిఫాస్‌ ప్రెసిడెంట్‌ గురుఆలంపల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు.

అమెరికాలో వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగు చిన్నారులకోసం ఏర్పాటు చేసిన 'పాఠశాల' కేంద్రాలు 2016-17 విద్యాసంవత్సరంను విజయవంతంగా నిర్వహించడంతోపాటు వివిధ చోట్ల పాఠశాల వసంతోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాల విద్యార్థుల భాషా పటిమను తెలియజేయడంతోపాటు, వారి కళానైపుణ్యాలను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.


ఇందులో భాగంగా సదరన్‌ కాలిఫోర్నియాలోని పాఠశాల కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన వసంతోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి. ఇర్వైన్‌లోని లేక్‌ వ్యూ సీనియర్‌ సెంటర్‌లో ఏప్రిల్‌ 1వ తేదీన జరిగిన ఈ వేడుకలకు చిన్నారులతోపాటు తల్లితండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల ఏరియా డైరెక్టర్‌ శ్రీధర్‌ సాతులూరి అందరినీ ఆహ్వానించి ప్రసంగించారు. తెలుగు భాషను సులభంగా విద్యార్థులకు ఎలా నేర్పుతున్నామో వివరించారు. వినోద్‌ బూరుగుపల్లి, సూర్య ప్రకాష్‌ భమిడిపాటి, నవీన్‌ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఇర్విన్‌ కేంద్రంలోని టీచర్లు సుందీప్త ఆచంట, శారద అమిర్నేని, శిరీష అల్లాని, మాధవిలత చుందూరు, రూపేష్‌ నర్రా, లేక్‌ఫారెస్ట్‌ కేంద్రంలలోని టీచర్లు వాణి కందిపాటి, రాజేష్‌ దొడ్డలపూడి, సురేష్‌ కోటపాటి (లేక్‌ఫారెస్ట్‌ కో ఆర్డినేటర్‌) తదితరులు విద్యార్థుల భాషా నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. హర్ష, శ్రీహరి, మహేష్‌ తదితరులు విద్యార్థుల సాంస్కృతిక కళా నైపుణ్యాన్ని ఫోటోలలో ఇనుమడింపజేశారు

మన మాతృభాష తెలుగును మన చిన్నారులకు నేర్పించే బాధ్యతను ప్రతి ఎన్నారై తెలుగు కుటుంబం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడటం ద్వారా వారికి మాతృభాషపై మమకారం కలిగేలా చూడాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వారు 'పాఠశాల' ద్వారా ప్రవేశపెట్టిన తెలుగు పలుకు కోర్స్‌ ఆన్‌లైన్‌ వర్షన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రసంగించారు. అమెరికాలోని చిన్నారులకు తెలుగును నేర్పిస్తున్న 'పాఠశాల'ను ఆయన అభినందించి ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా కూడా తెలుగు బోధనను చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇందువల్ల మరింతమందికి తెలుగు భాషను నేర్చుకునే సౌకర్యం కలిగిందన్నారు. ఎపి ప్రభుత్వం అందిస్తున్న తెలుగు పలుకు కోర్సును ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా నేర్చుకోవాలని కోరారు.


పాఠశాల చైర్మన్‌ జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, అమెరికాలో గత నాలుగేళ్ళుగా చిన్నారులకు తెలుగు భాషను 'పాఠశాల' నేర్పిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎపి ప్రభుత్వంతో కలిసి తెలుగు పలుకు కోర్స్‌ను చిన్నారులకు నేర్పిస్తున్నట్లు చెప్పారు. పాఠశాల వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి మాట్లాడుతూ, పాఠశాల ఇప్పుడు నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ గుర్తింపును కూడా కలిగి ఉందని చెప్పారు. ప్రపంచంలోని ఎన్‌ఆర్‌ తెలుగు కమ్యూనిటీకి తెలుగు భాషను బోధించడమే తమ లక్ష్యమని చెప్పారు.

పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, నేటి తరం చిన్నారులు సులభంగా తెలుగును నేర్చుకునేలా కొత్త సిలబస్‌తో అచ్చుపుస్తకాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త సిలబస్‌ ప్రకారం ఇ-లెర్నింగ్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. తెలుగు భాషను క్రమపద్ధతిలో నేర్పించడంతోపాటు శాస్త్రీయంగా అక్షరాలను అభ్యసించేలా బోధన ఉంటుందని చెప్పారు. Learning - Speaking - Reading- Writing పద్ధతిలో మా బోధన ఉంటుందని చెప్పారు. తొలుత భాషను తెలుసుకోవడం, తరువాత మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి చేయిస్తామని తెలిపారు. Forsys Inc కంపెనీ ప్రస్తుతం పాఠశాలకు టెక్నాలజీ పార్టనర్‌గా వ్యవహరిస్తోందని, ఆన్‌లైన్‌ కోర్సుల నిర్వహణ వ్యవహరాలను చూస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యురాలు విజయ ఆసూరి కూడా పాల్గొన్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా బే ఏరియాలో విజయవంతంగా నడుస్తున్న పాఠశాల నేడు సన్నివేల్ టెంపుల్ ఆడిటోరియంలో వసంతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంది. దాదాపు 150 మందికిపైగా పాఠశాల విద్యార్థులు తెలుగు భాష, సంస్కృతి ఉట్టిపడేలా 5 గంటలపాటు వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్లు రమేష్ కొండా, ప్రసాద్ మంగిన, సిఇఓ సుబ్బారావు చెన్నూరి వచ్చిన అతిధులకు తొలుత స్వాగతం పలికారు. సన్నివేల్, శాన్రామన్, ఫ్రీమాంట్, డబ్లిన్, శాన్హోసె పాఠశాల సెంటర్ విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. డబ్లిన్ విద్యార్థులు ప్రదర్శించిన దశావతారాలు, ఫ్రీమాంట్ విద్యార్థులు ప్రదర్శించిన బాహుబలి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 4 ఏళ్ళ వయస్సు ఉన్న పిల్లలు కూడా తెలుగులో మాట్లాడి, పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.


ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ సీతారామాంజనేయులు మాట్లాడుతూ, తెలుగు భాషలో పదాలకు మంచి భావాలు ఉన్నాయని చెప్పారు. అమ్మ అంటే ఆత్మీయత అని అంటూ, మమ్మీ అన్న పదానికి దీనికి చాలా తేడా ఉందన్నారు. అన్న అని పిలిచినప్పుడు కలిగే భావాలు, బ్రదర్ అని పిలిచినప్పుడు కలగవన్నారు. అలాంటి తల్లిభాష తెలుగును ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్న 'పాఠశాల' కృషిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్న పాఠశాల తెలుగు కోర్స్కి ప్రభుత్వ మద్దతు, సహకారం ఎప్పుడూ ఉంటాయని అన్నారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పాఠశాల' ద్వారా నిర్వహించిన 'తెలుగు అడుగు' పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇచ్చే అవకాశం తనకు లభించిడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పాఠశాల చైర్మన్ జయరామ్ కోమటి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు భాషను నేర్పుతున్న పాఠశాలకు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రావడం, మొదటిసారి తెలుగు అడుగు పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ద్వారా నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు.

పాఠశాల సిఇఓ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వారు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, ఎన్నారై పిల్లల కోసం కొత్త సిలబస్ను తయారు చేసి ఇచ్చారని, ఈ సిలబస్ ద్వారా తెలుగు నేర్చుకోవడం మరింత సులభమైందని చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్లైన్లోనూ, పాఠశాల కేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహించామని, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ను ప్రదానం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు అడుగు ప్రభుత్వ పరీక్షలో పాసైనవారికి, ఇతర క్లాస్లవారికి మెడల్స్, సర్టిఫికెట్లను ముఖ్య అతిధి రామాంజనేయులు ఇచ్చారు. పాఠశాల టీచర్లకు కూడా మెమోంటోలు ఇచ్చారు.

ఈ వసంతోత్సవంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కుపర్టినో మేయర్ సవితా వైద్యనాథన్, కుపర్టినో స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ అంజలి కౌజర్, ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ డా. యాంగ్ చావో, సరటోగా సిటీ కౌన్సిల్ మెంబర్ రిషి కుమార్, సన్నివేల్ సిటీ కౌన్సిల్ మెంబర్ లారీ క్లెన్తోపాటు థెరెసా కాక్స్ తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చారు.